“ఈ చదువు చదవలేకపోతున్నాను” సూసైడ్ నోట్ రాసి గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
ప్రేమ వేధింపులే కారణమని బాలిక తండ్రి ఆరోపణ
మనోరంజని – తెలుగు టైమ్స్, మహబూబ్‌నగర్ ప్రతినిధి | అక్టోబర్ 14,
మహబూబ్‌నగర్ జిల్లా రంగారెడ్డిగూడా పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రియాంక (17) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.మూడు రోజుల క్రితం ప్రియాంక “ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఇంటికి వెళతాను” అని చెప్పిందని, అయితే తండ్రి ఆమెను అక్కడే ఉండి చదువుకోవాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. సోమవారం, బాత్రూములో కిటికీకి ఉరి వేసుకున్న విద్యార్థినిని గమనించిన తోటి విద్యార్థినులు వెంటనే సమాచారం ఇచ్చారు. కళాశాల సిబ్బంది ప్రియాంకను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు తన కుమార్తెను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడని, ఈ వేధింపులే ఆత్మహత్యకు కారణమని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక రాసిన సూసైడ్ నోట్‌లో “ఈ చదువు చదవలేకపోతున్నాను” అనే వాక్యం ఉండడంతో, ఆత్మహత్య వెనుక ఉన్న అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.