కారంపూడి లో జర్నలిస్టుపై దాడి – పోలీస్ స్టేషన్ పరిధిలోనే బెదిరింపులు
మనోరంజని ప్రతినిధి – కారంపూడి, అక్టోబర్ 20
కారంపూడి మండలంలో సీనియర్ జర్నలిస్టుపై ఇద్దరు టిడిపి నాయకులు బహిరంగంగా దాడి చేసి, పోలీస్ స్టేషన్ పరిధిలోనే “కత్తితో చంపేస్తా” అంటూ బెదిరించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సుమారు 60 ఏళ్ల వయసు గల వెటరన్ జర్నలిస్టు ఆలూరి లక్ష్మణరావుపై ఈ దాడి జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈయన స్థానికంగా నిర్భయంగా నిజాలను వెలికితీసే జర్నలిస్టుగా పేరుపొందారు. ఇటీవల ఆయన స్థానిక వైసీపీ నాయకుడికి చెందిన స్థలం సంబంధిత వార్తా కథనం ప్రచురించినట్లు సమాచారం.
దీనిపై ఆగ్రహించిన ఇద్దరు టిడిపి నాయకులు బాధితుడిపై బహిరంగంగా దాడి చేయడమే కాకుండా, పోలీస్ స్టేషన్ సమీపంలోనే కత్తితో చంపేస్తామని బెదిరించారని స్థానికులు తెలిపారు. వయసుతో పాటు వృత్తి స్వేచ్ఛకు గౌరవం చూపకుండా జర్నలిస్టుపై దాడి చేయడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేపింది.
ఈ ఘటనపై స్థానిక ప్రజలు, మీడియా వర్గాలు తీవ్రంగా స్పందించాయి. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై తక్షణమే కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికులు పేర్కొన్న వివరాల ప్రకారం, ఇటీవలి కాలంలో కారంపూడి మండలంలో ఇటువంటి దౌర్జన్యాలు పెరిగిపోతున్నప్పటికీ, పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జర్నలిస్టు హక్కులను రక్షించేందుకు పత్రికా సంఘాలు ఏకమై నిరసనలు వ్యక్తం చేయనున్నట్లు సమాచారం.