రైతులకు మద్దతు ధర అందేలా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని తహశీల్దార్ పి. శ్రీనివాస్ ఆదేశించారు. బి. అన్నారం గ్రామంలోని పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలని రైతులను తహశీల్దార్ కోరారు.
కొనుగోలు కేంద్రాలలో సీరియల్ ప్రకారం కాంటాలు వేయడం, సకాలంలో ఎగుమతులు, దిగుమతులు జరిగేలా చూడటం, సరైన తూకం వేయడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు.
అలాగే, కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లతో సహా అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సహకార శాఖ అధికారులు, పాక్స్ ప్రతినిధులు, గ్రామ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.












