Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున, రైతులు పంట మార్పిడి విధానాలను అవలంబించి, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి, ఉద్యానవన, ఆయిల్‌పామ్ వంటి పంటల వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. నిర్మల్ గ్రామీణ మండలం చిట్యాల గ్రామంలోని రైతువేదికలో నిర్వహించిన జిల్లా స్థాయి విత్తన మేళాను ఆయన ప్రారంభించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు పంట మార్పిడి విధానాలను అవలంబించాలని, తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. సోమవారం నిర్మల్ గ్రామీణ మండలం చిట్యాల గ్రామంలోని రైతువేదికలో నిర్వహించిన జిల్లా స్థాయి విత్తన మేళాను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విత్తన ప్రదర్శన స్టాళ్లను పరిశీలించి, రైతులకు పత్తి, కూరగాయలు తదితర పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలను సంరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలు, ఉద్యానవన పంటలు, కూరగాయల సాగును రైతులు ప్రోత్సహించాలని సూచించారు. సంప్రదాయ సాగు విధానాలకు బదులుగా శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు అధిక దిగుబడులతో పాటు మెరుగైన ఆదాయం పొందవచ్చని తెలిపారు.
ఆయిల్‌పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా లాభదాయకంగా ఉంటుందని, ప్రభుత్వం కూడా దీనిని ప్రోత్సహిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 8,751 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని, ఈ ఏడాది 1,600 ఎకరాల లక్ష్యానికి ఇప్పటికే 1,670 ఎకరాలకు సంబంధించిన నాన్-సబ్సిడీ మొత్తాన్ని రైతుల నుంచి సేకరించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జిల్లాలో 5,000 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
రైతులు అవసరానికి మించి రసాయనిక ఎరువులను వినియోగించవద్దని, తప్పనిసరిగా భూసార పరీక్షలు నిర్వహించి, వ్యవసాయశాఖ అధికారులు సూచించిన మేరకే ఎరువులను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. భూసారాన్ని పరిరక్షించడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించేందుకు నానో యూరియా వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. రైతులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాలని, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమణ, సర్పంచ్ సుప్రియ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.












