జిల్లాలో ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శనివారం లోకేశ్వరం మండలంలోని సాత్ గావ్, నగర్ గ్రామాల్లోని రైస్ మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సాత్ గావ్ గ్రామంలోని శ్రీదుర్గా రైస్ మిల్లును సందర్శించిన కలెక్టర్, అక్కడ యంత్రాల సహాయంతో జరుగుతున్న ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ మంది హమాలీలతో అధిక పరిమాణంలో ధాన్యం సంచులను అన్లోడ్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఇతర రైస్ మిల్లుల యాజమాన్యాలు కూడా ఇటువంటి అధునాతన యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తనిఖీల సందర్భంగా మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య, మిల్లుల నిల్వ సామర్థ్యం, ఇప్పటివరకు అన్లోడ్ చేసిన ధాన్యం పరిమాణం, ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీల సంఖ్య వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లారీల ద్వారా వచ్చే ధాన్యాన్ని వెంటవెంటనే అన్లోడ్ చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం నగర్ గ్రామంలోని రైస్ మిల్లును సందర్శించిన కలెక్టర్, ధాన్యం నిల్వకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. తగిన సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచి అన్లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు, లోకేశ్వరం తహసిల్దార్ సూర్యారావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












