సైబర్ సురక్ష, జాతీయ భద్రత మరియు మత్తు పదార్థాల నివారణ కార్యక్రమం
మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 15
నిజామాబాద్ జిల్లా భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కార్యక్రమంలో భాగంగా “సైబర్ సురక్ష, జాతీయ భద్రత మరియు మత్తు పదార్థాల నివారణ” అంశంపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రక్షణ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ కే. సందీప్ మాట్లాడుతూ, “ఇంటర్మీడియట్ దశ విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకం. ఈ సమయంలో గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల ప్రలోభాలకు లోనవకుండా చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలి. మాదకద్రవ్యాలు మన భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తాయి” అని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాల బారిన పడకుండా సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ, “ఆన్లైన్ గేమ్స్, ఫేక్ లింక్స్, స్కామ్‌ల ద్వారా జరిగే సైబర్ నేరాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. చిన్న తప్పిదాలు జీవితాన్ని మార్చేస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి,” అని విద్యార్థులకు సూచించారు. కౌన్సిలర్స్ డాక్టర్ మండలోజు నర్సింహ స్వామి, పల్లె శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, సమయ నియంత్రణ, స్మార్ట్‌ఫోన్ వినియోగంపై అవగాహన కల్పించారు. కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ జాడే సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, మూడు మందితో బైక్‌పై ప్రయాణించకూడదని, క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.