నాగపంచమిని పురస్కరించుకొని పుట్టల వద్ద మహిళల ఆరాధన
నిజామాబాద్, జూలై 29 (M4News): నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో పుట్టలకు పాలు పోసి పూజలు నిర్వహించారు. సూర్యోదయం కంటే ముందే లేచి సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని, పుట్టల వద్దకు చేరిన మహిళలు పాలు పోసి నాగదేవతలకు అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సోదరులకు కళ్ళు కడిగిన మహిళలు, రక్త సంబంధానికి మించిన బంధం లేదని, ఈ పరంపరను కొనసాగించాలని ఆకాంక్షించారు. నాగపంచమి పూజ సోదర–సోదరీ అనుబంధానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, ఈ తరుణంలో సోదర సోదరీల మధ్య ప్రేమ, అనురాగాలను బలపర్చేలా చేస్తుందని గో సేవ ఆలయ పరిశుభ్రత కార్యదర్శి మాల్వేకర్ ప్రభావతి తెలిపారు.
ఇప్పటి కాలంలో బంధాలు క్రమంగా దూరమవుతున్న తరుణంలో పెద్దలు చెప్పిన ఆచారాలు, సంస్కృతిని కొనసాగించాలన్నారు. “ప్రతి కుటుంబంలో ప్రేమతో కూడిన అనుబంధాలు పెరగాలని, ఆత్మీయంగా జీవించాల్సిన అవసరం ఉందని” ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దీక్షిత నాగసాయి ప్రభావతి, మరాఠీ శారదా, పోలాస జ్యోతి, పొలాస యాదగిరి, చంద్రశేఖర్, నరేందర్, చండాలియా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు