కేజ్రీవాల్‌పై గెలిచిన ప్రవేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఎవరు?..!!
డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు.
ఆయనపై బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ విజయం సాధించారు.
న్యూదిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ మొత్తం 14 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 4,089 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ప్రవేశ్ దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ మూడో స్థానంలో నిలిచారు.
మొత్తం 14 రౌండ్లపాటు సాగిన లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ సాహిబ్ సింగ్ 30,088 ఓట్లు సాధించి 4,089 కేజ్రీవాల్‌పై ఆధిక్యం సాధించారు.
కేజ్రీవాల్ మొత్తం 25,999 ఓట్లు సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్‌కు 4,568 ఓట్లు వచ్చాయి.
మాజీ సీఎం కుమారుడిగా వచ్చి..
కేజ్రీవాల్‌పై విజయం సాధించిన ప్రవేశ్ వర్మ పూర్తి పేరు ప్రవేశ్ సాహిబ్ సింగ్.
ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ 1996 నుంచి 1998 మధ్య దిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
మదన్‌లాల్ ఖురానా తరువాత సుమారు రెండున్నరేళ్లు దిల్లీ సీఎంగా పనిచేసిన ఆయన అనంతరం 1999లో ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు.
వాజపేయీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.
,భారీ మెజార్టీల నేతగా పేరు…
సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన ప్రవేశ్ దిల్లీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ 2013లో దిల్లీలోని మహరోలీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
అనంతరం 2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో ఆయన పశ్చిమ దిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు.
2014లో 2 లక్షల 68 ఓట్ల తేడాతో గెలిచిన ప్రవేశ్ 2019లో 5 లక్షల 78 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
దీంతో భారీ మెజారిటీలు సాధించే నేతగా బీజేపీలో పేరు సంపాదించారు.
పార్లమెంటులో లోక్‌సభ సభ్యుడిగా ఉన్న కాలంలో, ప్రవేశ్ వర్మ పార్లమెంటు సభ్యుల జీతభత్యాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ, పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు ప్రవేశ్ వర్మ.
వివాదాస్పద వ్యాఖ్యలపై వివాదం
ప్రవేశ్ వర్మ చేసిన ఘాటైన వ్యాఖ్యల వల్ల చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. 2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రవేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్‌ను “ఉగ్రవాది” అని కూడా పిలిచారు. దీనిని గమనించిన ఎన్నికల సంఘం 24 గంటల పాటు ప్రచారం చేయకుండా ఆయనపై నిషేధం విధించింది.
“పంజాబ్‌లో రిజిస్టర్ చేసిన వేలాది వాహనాలు దిల్లీలో తిరుగుతున్నాయి” అని వర్మ అన్నారు. ఆ కార్లలో ఎవరెవరు ఉన్నారు? “జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) కోసం ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి.” అని ఇటీవలి ఎన్నికల ప్రచారంలో ప్రవేశ్ వర్మ చేసిన వ్యాఖ్య చాలా వివాదాస్పదమైంది.
ఈ ప్రకటనపై అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఇది పంజాబీలను అవమానించడమేనని, దీనికి వర్మ పంజాబీలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
2025 ఎన్నికల సమయంలో, మహిళా ఓటర్లకు బూట్లు పంపిణీ చేశారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం ప్రవేశ్ వర్మపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద కేసు నమోదు చేసింది.
ఎన్నికల సంఘం అందించిన సమాచారం ప్రకారం, రజనీష్ భాస్కర్ అనే ఫిర్యాదుదారు న్యాయవాది…. ప్రవేశ్ వర్మకు సంబంధించిన రెండు వీడియోలను ఎన్నికల సంఘానికి పంపారు, దానిపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది.
ఇటువంటి వివాదాలు ఉన్నప్పటికీ, ప్రవేశ్ వర్మ దిల్లీ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా కొనసాగారు, ఎన్నికల ప్రచారాలలో దూకుడైన వాక్చాతుర్యానికి, బహిరంగ వ్యాఖ్యలకు పేరుగాంచారు