*పాలకులు మారిన పాత్రికేయుల జీవితాల్లో మార్పులు ఏవి..?*
*జర్నలిస్టుల సంక్షేమం పాలకులకు పట్టదా… ?*
*జర్నలిస్ట్ ఏం పాపం చేశాడు మహాశయ…?*
*తిన్న తర్వాత విసిరేసే అరిటాకు సామెతగా జర్నలిస్టుల జీవితం!*
*(M.Suresh Babu,Journalist)*
ఎండైనా వానైనా, అర్ధరాత్రి అయినా మిట్ట మధ్యాహ్నం అయినా, తాను తిన్న తినకుండా ఉన్న, ప్రభుత్వ సమాచారం అయినా ప్రజా సమస్య అయినా ప్రతిపక్ష పార్టీల వాణి అయినా, ప్రెస్ మీట్ అయినా స్పాట్ న్యూస్ అయినా , తీవ్ర ఎండైనా జోరున వానైనా, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ గడియారంతో పోటీపడుతూ ప్రజలకు సమగ్ర సమాచారం చేరవేసే సైనికుడు జర్నలిస్ట్. ప్రభుత్వాలు తీసుకునే పలు ప్రజాహిత నిర్ణయాలు, ప్రభుత్వాలు సాధించిన విజయాలు ,ప్రజలకు ప్రచారం చేయాలంటే మీడియా కావాలి జర్నలిస్ట్ కావాలి. పాలక మరియు ప్రతిపక్ష పార్టీల కార్యాచరణ, వారి వాణి ప్రజలకు వినిపించాలంటే మీడియా కావాలి జర్నలిస్టు కావాలి. ప్రజలు ఎదుర్కొని పలు ప్రజా సమస్యలు అధికార యంత్రాంగానికి ప్రభుత్వానికి చేరవేసే వారదులు పాత్రికేయులు. ప్రజాస్వామ్య నిర్వహణలో అత్యంత కీలక పాత్ర పోషించే ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధులైన జర్నలిస్టుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రధానంగా 25 నుండి 30 సంవత్సరాల సుదీర్ఘ జర్నలిస్టు జీవితాన్ని గడిపిన పలువురు పాత్రికేయుల జీవితాలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. జర్నలిజం పట్ల మక్కువ, సమాజం పట్ల బాధ్యత కలిగిన ఎందరో విజ్ఞానవంతులు, మేధావులు పాత్రికేవృత్తిని చేపట్టి ప్రజాస్వామ్య నిర్వహణలో తమ వంతు సుదీర్ఘ పాత్రను నిర్వహించారు, ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో వారు సంపాదించింది ఏమిటి అంటే…ఆర్థిక ఇబ్బందులు, బిడ్డల చదువుల కోసం వైద్య ఖర్చులకోసం అప్పులు, అనారోగ్యాలు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయుడు కాలంతో పరిగెడుతూ నిరంతరం వార్తా సమాచారం ప్రజలకు చేరవేసే పనిలో మునిగిపోతుంటారు. అధికారులు అమాత్యులతో పరిచయాలు, సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపుకు ఏ మాత్రం లోటులేదు. కానీ మనిషి జీవనానికి అవి మాత్రం సరిపోవు. వృత్తిపరంగా పాత్రికేయులకు వచ్చే ఆదాయం ఏమాత్రం కుటుంబ పోషణకు సరిపోదు అనేది అక్షర సత్యం. స్టాఫ్ రిపోర్టర్లు, బ్యూరోలు, డెస్క్ సబ్ ఎడిటర్లుకు వివిధ పెద్ద పత్రిక యాజమాన్యాలు కొంతమేరకు గౌరవ వేతనం ఒక సాధారణ స్థాయి జీతం ఏర్పాటు చేస్తాయి. వారి కుటుంబ పోషణకు పిల్లల చదువులకు ఆరోగ్య రక్షణకు ఏ మాత్రం సరిపోదు అనేది సత్యం. మీడియా వ్యవస్థలో వీరి శాతం అతి స్వల్పం. ప్రధానంగా ఫీల్డ్ లో విధులు నిర్వర్తిస్తూ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించే గ్రామీణ, నియోజకవర్గ విలేకరులు, ఆర్సి ఇన్చార్జిలు పరిస్థితి చాలా దయనీయం. సరైన ఆదాయం లేక బిడ్డల చదువులకు సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితి. అంతేకాకుండా సొంత ఇల్లు లేకుండా అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటూ కాలం వెల్లదీస్తున్న పాత్రికేయులు కోకొల్లలు. ప్రభుత్వం పాత్రికేయుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రాతిపదికన అడ్మిషన్లు ఇవ్వాలి అన్నట్లు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పలు కార్పొరేట్ ప్రైవేట్ యాజమాన్యాలు పాత్రికేయుల పిల్లలకు ఉచితంగా అడ్మిషన్ ఇవ్వడంలేదని పాత్రికేయులు వాపోతున్నారు. వేళగాని వేళల్లో ఆహారాన్ని, ఆరోగ్యాన్ని పక్కనపెట్టి వార్తా సేకరణకు పరుగులు పెడుతున్న పాత్రికేయుల ఆరోగ్యాలు క్షీణిస్తున్నప్పటికీ ముఖంపై చిరునవ్వే అలంకారంగా శరీరంలోని రోగాలతో పోరాటం చేస్తూ విధి నిర్వహణలో ముందుకు సాగిపోయే యోధులు జర్నలిస్టులు. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులు పాలైన పలకరించే దిక్కు లేక సాయం చేసే చేతులు ముందుకు రాక తోటి జర్నలిస్టుల సహకారంతో కొద్దో గొప్ప తాత్కాలిక సహాయం ద్వారా జీవనాన్ని వెల్లదీస్తున్న జర్నలిస్టులు సైతం లేకపోలేదు.
పాలకులు, ప్రతిపక్షాలు పాత్రికేయుల సేవలు వినియోగించుకుంటున్నారు గాని వారి సంక్షేమం గురించి మాత్రం ఏమాత్రం ఆలోచన చేయడం లేదనేది ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘం పనిచేసిన పలువురు పాత్రికేయుల జీవితాలను గమనిస్తే అర్థమవుతుంది. కేవలం కొద్ది శాతం మంది స్థితిమంతులు, ఆదాయ వనరులు ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవారు జర్నలిజంపై మొక్కులతో కొనసాగుతున్నప్పటికీ అత్యధిక శాతం మంది అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వాలు తప్పనిసరిగా జర్నలిస్టుల సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకోవాలి. కేవలం అక్రిడేషన్ కార్డులు బస్సు పాసులు,హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు మంజూరు చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప పాత్రికేయ కుటుంబాలకు సరైన ఆదాయం మరియు వారి బిడ్డలకు చదువు సొంత ఇల్లు ఏర్పాటు వంటి కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
*జర్నలిస్టులపై విమర్శలు…*
అబ్బో జర్నలిస్టులా… ఇంకేముంది అందరినీ బెదిరించి డబ్బులు దండుకోవచ్చు…..వాళ్లకు ఉన్నన్ని ఆదాయ మార్గాలు ఇంకెవరికి ఉన్నాయి. ఏ పని చేయరు….ఎక్కడికి వెళ్ళినా చేయి చేసిన డబ్బే డబ్బు… అని చాలామంది వ్యంగ్య వ్యాఖ్యానాలు విసరటం చేస్తుంటారు. ప్రెస్మీట్లోకి వెళితే డబ్బులు రిమాండ్ చేయడం, మద్యం సిండికేట్, రేషన్ సిండికేట్ ,ఇసుక మాఫియా సిండికేట్ ల వద్ద డబ్బులు దండుకుంటూ అడ్వర్టైజ్మెంట్ పేర్లతో వ్యాపారస్తులు వద్ద డబ్బులు వసూలు చేస్తూ దర్జా జీవితాన్ని గడుపుతున్నారంటూ వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఇక్కడే అందరూ ఆలోచించాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇటువంటి పనులకు ఓడిగడుతున్న వారంతా నిజమైన, నాణ్యమైన అర్హులైన జర్నలిస్టులేనా? ఒకవేళ వారు నిజంగా జర్నలిస్టులు అయితే వారు ఎంత కాలం నుంచి జర్నలిజంలో కొనసాగుతున్నారు?
వారి పత్రిక యాజమాన్యాలు ఏవైనా అనుచితమైన,
అసాధ్యమైన టార్గెట్లు నిర్ధారించి ఫీల్డ్ లో తిప్పుతున్నారా…? జర్నలిస్టు అని చెప్పుకుంటున్న సదరు వ్యక్తి విద్యార్హతలు,జీవన విధానం, ప్రవర్తన మరియు ఆలోచన శైలి ఏ విధంగా ఉన్నాయి..,వంటి
ప్రశ్నలు చాలా విలువైనవి.ఎందుకంటే ఏ జర్నలిస్టు పవిత్రమైన జర్నలిజంలో ప్రతినిధిగా ఉంటూ అతి తొందరగా చెడ్డ పేరు తెచ్చుకోవడానికి సిద్ధపడరు. అటువంటి వారి ప్రవర్తన చాలా నిక్కచ్చిగా, నిబద్ధతతో కూడి ఉంటుంది.మరి ప్రజల చేత చిత్కారానికి గురవుతు, జర్నలిస్టులమని చెప్పుకుంటున్న ఇటువంటి కేటగిరి వారు ఎవరు? అటువంటి వారి చర్యల వలన నిజమైన పాత్రికేయుల ప్రతిష్ట దెబ్బతింటుంది. పాలకులు ఆలోచన చేపట్టి జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం ఐదు సంవత్సరాలు శాసనసభ్యులుగా కొనసాగితేనే భవిష్యత్తు సెక్యూరిటీ దృష్ట్యా పెన్షన్ ఏర్పాటు చేసుకున్న శాసనసభ్యులు నిరంతరం వార్తా సమహారంతో ప్రజలకు సేవలు అందించే తోటి ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధులైన జర్నలిస్టులకు చేయూతనిచ్చి వారి కుటుంబాలను నిలబెట్టే ఆలోచన చేయాలి. అన్ని రకాల ప్రచార వ్యవహారాలకు పాత్రికేయులు, మీడియా అవసరం. కానీ వారి జీవితం, వారి అభివృద్ధి మాత్రం ఎవరికి అవసరం లేదన్నట్లుంది. సాధారణంగా ప్రజలు తాము తినాలనుకున్న ఆహార పదార్థాలన్నీ ఒక ఇస్తరాకు సహకారంతో తీసుకుంటారు. తమ పని పూర్తయిన తర్వాత ఇస్తరాకులు తీసి డస్ట్ బిన్ లో పారవేయటం పరిపాటి. అదేవిధంగా పలు వ్యవస్థలు పాత్రికేయుల యొక్క సహకారం తీసుకుంటూ, వారి యొక్క వ్యవహారాలు గడుపుకుంటూ జర్నలిస్టు లను దూరంగా పెట్టడం అత్యంత బాధాకరం.
*ఫోర్త్ ఎస్టేట్ ప్రతిష్ట ఇనుమడింపజేసే సమగ్ర చర్యలు చాలా అవసరం.*
రాజ్యాంగ వ్యవస్థల్లో కీలకమైన ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధుల,మీడియా ప్రతిష్ట ఇనుమడింపజేసే అవసరమైన అన్ని రకాల చట్టపరమైన చర్యలు ఎంత త్వరగా చేపడితే అంత మంచిది. పాత్రికేయులకు విద్యార్హతలు, కొద్దికాలం అప్రెంటీస్, అప్రెంటీస్ సమయంలో కనీస గౌరవ వేతనం ఏర్పాటు చేయడం, వారి సర్వీస్ ప్రాతిపదికన అవసరమైన విద్య, వైద్య ఆర్థిక బెనిఫిట్ లను అందించటం,గృహవసతి ఏర్పాటు చేయటం మరియు వృత్తిలో భాగంగా పలుచోట్లకు ప్రయాణించే క్రమంలో ఉచిత ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేయడం, ఉన్నత విద్యలోపాత్రికేయుల పిల్లలకు రాయితీలు కల్పించడం వంటి అవసరమైన, గౌరవప్రదమైన చర్యలు చేపట్టి జర్నలిస్టులకు సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. ఎందుకంటే జర్నలిస్టులు ఈ దేశ పౌరులే ప్రభుత్వం నుండి అవసరమైన సహాయ సహకారాలు పొందే హక్కు రాజ్యాంగం ద్వారా కలిగి ఉన్నారు. ప్రభుత్వం ఈ విధంగా చేయటం వల్ల ఒకటి నకిలీ జర్నలిస్టులు, నాణ్యతలేని,విలువలు లేని, కనీస విద్యార్హత లేకుండా జర్నలిస్టులమని చెప్పుకొని తిరిగే అయోగ్యులను వృత్తికి దూరం చేసి, నిజమైన జర్నలిస్టులను ఆదరించి, అండదండలు అందించి అటువంటి వారి సహకారాన్ని మరింత తీసుకొని నిజమైన జర్నలిజం యొక్క స్థాయిని సుస్థిరం చేయడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల కనీస సంక్షేమం పట్ల దృష్టి సారించి వారికి కనీస తోడ్పాటు అందించాలి.
మరి పాలకులు పాత్రికేయుల సమస్యల పట్ల ఎంతవరకు దృష్టి సారించి తోడ్పాటు అందిస్తారనేది వేచి చూడాల్సిందే.
*మునిపల్లి సురేష్ బాబు.*
*జర్నలిస్ట్.*
*అమరావతి.*
*9951173460.*