తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
వాతావరణ శాఖ ప్రకారం, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అనేక ప్రాంతాలలో 45 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది. ఎండల తీవ్రత, వడగాడ్పుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావును ఆదేశించి, అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సూచించారు.
ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేస్తూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులను భారీగా అందుబాటులో ఉంచాలని తెలిపారు. వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు ప్రత్యేక వార్డులు, సిబ్బందిని సిద్ధం చేయాలని సూచించారు.
వేసవిలో తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యుత్ వినియోగం పెరిగినా లోడ్ షెడ్డింగ్ లేకుండా చూడాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని నివారించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చలివేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు చేయవద్దని, ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలు, నిరుపేదల విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.








