ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.
ఆదివారం, ఏప్రిల్ 6వ తేదీన, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని, ఈ జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేయబడ్డాయని పేర్కొంది.
ఏప్రిల్ 7వ తేదీన రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 8వ తేదీన మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలలో 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అయితే, ఏప్రిల్ 9వ తేదీ నుంచి తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంటుందని, ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరోవైపు, సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం, 17 మండలాల్లో తీవ్రవడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












