నీటి పాలు అయినా వరి ధాన్యం – గిరిజన మహిళా రైతు రోదన
వర్షపు నీటిలో కొట్టుకుపోయిన పంట – అప్పుల పాలైన లక్ష్మి ప్రభుత్వ సహాయం కోరుతూ కన్నీటి పర్యవసానం
✍ మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి గుర్రం నరేష్ – అక్టోబర్ 30,
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామ పరిధిలో గల లంబాడీ తాండాకు చెందిన మహిళా రైతు లక్ష్మి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అప్పు చేసి పండించిన వరి పంటను కోత తరువాత రోడ్డుపై ఎండబెట్టగా, రాత్రి కురిసిన భారీ వర్షం ఆమె కష్టార్జిత ధాన్యాన్ని పూర్తిగా నీటిపాలు చేసింది. రోడ్డు దిగువగా ఉండడంతో వర్షపు నీరు ధాన్యంపైకి వచ్చి, వడ్ల గింజలు వరదలో కొట్టుకుపోయాయి.
పంటను కాపాడుకునే ప్రయత్నంలో విఫలమైన లక్ష్మి, కంటతడి ఆపుకోలేక ఆవేదనతో మాట్లాడుతూ “పంట కోసానికి తీసుకున్న అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. ఇల్లు కూడా లేని మేము పూరి గుడిసెలోనే జీవిస్తున్నాం. కనీసం ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి,” అని మీడియా ముందు వేడుకుంది. స్థానిక రైతుల సమాచారం ప్రకారం, మండలంలోని అనేక గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ప్రజలు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని, బాధిత రైతులకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.