- జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
- శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లు ప్రవేశపేట్టే అవకాశం
- విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు
- రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు
జమిలి ఎన్నికల (One Nation One Election)పై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
జమిలి ఎన్నికల (One Nation One Election)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్‌లు తమ ఎంపీలకు విప్ జారీచేసి, 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని సూచించాయి. జమిలి ఎన్నికలపై వ్యతిరేక, అనుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (JPC) సిఫార్సు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపే అవకాశముంది.