గుర్తింపు లేని పాఠశాలలను వెంటనే రద్దు చేయాలి – ట్రస్మా ఆధ్వర్యంలో వినతి పత్రం
నిర్మల్, జూలై 7 (మనోరంజని ప్రతినిధి):
నిర్మల్ జిల్లాలో అనుమతుల్లేని పాఠశాలలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రస్మా నేతృత్వంలో శుక్రవారం జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని మరియు కలెక్టర్ కార్యాలయ పిర్యాదు విభాగాన్ని సందర్శించి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ – గత ఐదేళ్లుగా అనుమతులు లేని పాఠశాలలు 10వ తరగతిదాకా క్లాసులు నడుపుతున్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి ఉన్నది కేవలం 7వ తరగతి వరకే అయినప్పటికీ, అక్రమంగా ఉన్నత తరగతుల బోధన కొనసాగుతోందన్నారు.
ఇలా చదివిన విద్యార్థులకు వెరిఫికేషన్ సమయంలో సర్టిఫికెట్ సమస్యలు ఎదురవుతున్నాయని, ఇప్పటికే DEO గారికి పలు విజ్ఞప్తులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వచ్చే వారం లోపు చర్యలు తీసుకోకపోతే రెండు ట్రస్మా ల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా టౌన్ బాధ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, చంద్రగౌడ్, శ్రీధర్, పద్మనాభగౌడ్, శ్యామ్ ప్రకాష్, అబ్బాస్, షబ్బీర్, ప్రమోద్ రావు, వినోద్, శ్రీనివాస్, సిద్ధార్థ్ రెడ్డి, సాయన్న గౌడ్, ఖాలిక్ తదితరులు పాల్గొన్నారు. పలు పాఠశాలల కరెస్పాండెంట్‌లు కూడా పాల్గొన్నారు.