లంబాడీలకు మంత్రి పదవి డిమాండ్ – నల్గొండలో గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు మోహన్ పవర్ ముందస్తు అరెస్ట్

లంబాడీలకు మంత్రి పదవి డిమాండ్ – నల్గొండలో గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు మోహన్ పవర్ ముందస్తు అరెస్ట్

లంబాడీలకు మంత్రి పదవి డిమాండ్ – నల్గొండలో గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు మోహన్ పవర్ ముందస్తు అరెస్ట్

మనోరంజని ప్రతినిధి  నల్గొండ, జూలై 31:
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీలకు మంత్రి పదవి కేటాయించాలన్న డిమాండ్‌ నేపథ్యంలో గిరిజన సంఘాల ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపధ్యంలో గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ పవర్ ను మల్లెపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
మోహన్ పవర్ నేతృత్వంలో గిరిజన సంఘాలు గాంధీ భవన్ ముట్టడి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టగా, దాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. లంబాడీ (బంజారా) కులం తెలంగాణలో షెడ్యూల్డ్ ట్రైబ్‌గా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వకుండా వివక్ష చూపుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల్లో లంబాడీలకు మంత్రి పదవులు దక్కగా, ఇప్పుడు వారికి ఏ ప్రాతినిధ్యమూ లేకపోవడం తీవ్ర నిరసనలకు దారితీసింది.
ఈ సందర్భంగా మోహన్ పవర్ మీడియాతో మాట్లాడుతూ, “అరెస్టులతో ఉద్యమం ఆపలేరు. మంత్రి పదవి ఇవ్వకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లంబాడీలు తమ సామర్థ్యం చూపించకుండా ఉండరు,” అని హెచ్చరించారు. అలాగే, లంబాడీలను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు మోసపూరితంగా వెనకడుగు వేస్తోందని మండిపడ్డారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంఘాలు నిరసనలు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని జిల్లాల్లో ఉద్యమాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద చిక్కుగా మారే అవకాశముంది.

Join WhatsApp

Join Now

Leave a Comment