నిర్మల్, జూలై 14
నిర్మల్ పట్టణంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చిరు వ్యాపారులపైనే చర్యలు తీసుకుంటున్నారని, అసలు కారణాలపై దృష్టి సారించడం లేదని విమర్శిస్తున్నారు.
నిర్మల్ పట్టణంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యలను నివారించడంలో పాలకులు, సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ నియంత్రణ పేరుతో పోలీసులు, పురపాలక శాఖ అధికారులు ప్రధానంగా రహదారులపై జీవనోపాధి సాగించే చిరు వ్యాపారులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దుకాణాల తొలగింపు, క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ట్రాఫిక్ సమస్యకు దారితీసే అసలు కారణాలపై దృష్టి సారించడం లేదని విమర్శిస్తున్నారు.
పట్టణంలోని పలు వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ సదుపాయాలు ఉన్నప్పటికీ, వాటిని వినియోగించకుండా వాహనాలను రహదారులపైనే నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాణిజ్య సముదాయాల యజమానులపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ రూపొందించి, పార్కింగ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు చిరు వ్యాపారుల జీవనోపాధికి భంగం కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.












