నిర్మల్, జులై 2
లోకేశ్వరం మండలంలోని మన్మద్–అర్లి గ్రామాల మధ్య ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ వంతెన ఇరుకుగా ఉండటంతో, రక్షణ గోడలు, రహదారి దెబ్బతినడంతో రాత్రి వేళల్లో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది.
లోకేశ్వరం మండలంలోని మన్మద్–అర్లి గ్రామాల మధ్య ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుండగా, వంతెన ఇరుకుగా ఉండటంతో ఎదురెదురుగా వచ్చే భారీ వాహనాల సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వంతెనపై రక్షణ గోడలు దెబ్బతినడం, రహదారి పాడవడం వల్ల రాత్రి వేళల్లో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొన్నదని వారు పేర్కొంటున్నారు.
అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టడంతో పాటు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన వంతెన నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఏదైనా ఘోర ప్రమాదం జరిగేలోపు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.












