అటవీ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి:
– జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 30 – జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ ప్రాంత అభివృద్ధికి మంజూరైన పనులు, లభించిన అటవీ అనుమతులు, చేపట్టిన పనుల పురోగతిని అధికారుల వద్ద నుండి వివరంగా తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గిరిజన ప్రాంతాలు, తండాల అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక వసతులు, రోడ్లు, వంతెనలు, డ్రైనేజీ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అయా ప్రాంతాల్లో అవసరమైన చోట్ల అటవీ, ఆర్ అండ్ బి అధికారులు సంయుక్తంగా సర్వేలు నిర్వహించాలని పేర్కొన్నారు. నిర్మాణ పనుల కోసం సంబంధిత అటవీ అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. పునరావాస గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అందించే అన్ని రకాల సౌకర్యాలు అర్హులకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల నగదు, భూములు తదితర పరిహారాలు అందజేయాలని చెప్పారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిఎఫ్ఓ నాగినిబాను, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఆర్ అండ్ బి, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు