హత్య జరిగిన రోజే.. నిందితుడిని ముందే అనుమానించిన తల్లి!

హత్య జరిగిన రోజే.. నిందితుడిని ముందే అనుమానించిన తల్లి!

హత్య జరిగిన రోజే.. నిందితుడిని ముందే అనుమానించిన తల్లి!

వర్తన చూసి ప్రశ్నిస్తే.. దబాయించిన బాలుడుక్రైమ్‌ వెబ్‌సిరీస్‌లు చూసి తప్పటడుగులు

సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు

హైదరాబాద్‌: ఎవరైనా తోటి పిల్లల వస్తువులపై మనసు పడితే తనకూ కొనివ్వాలని తల్లిదండ్రులను పోరుపెడతారు..

అతను మాత్రం ఇంట్లోకి చొరబడి ఎలా కొట్టేయాలో ప్లాన్‌ రాసుకున్నాడు. పిల్లలు తప్పు చేస్తూ దొరికిపోతే భయంతో పారిపోతారు.. అతను మాత్రం హత్య వరకూ వెళ్లాడు. ఇలాంటి నేరం చేస్తే ఎవరైనా భయపడిపోతారు.. అతను మాత్రం ఏ జంకూ లేకుండా ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నించాడు. పక్కింట్లో బాలికను చంపేసి కూడా బాధపడని అతడు.. అదేరోజు తన పెంపుడు కుందేలు చనిపోతే మాత్రం దిగాలు పడ్డాడు. అనుమానంతో ప్రశ్నించిన తల్లినీ మాయమాటలతో బురిడీ కొట్టించాడు. కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడు పదో తరగతి విద్యార్థి ప్రవర్తన ఇది. విచారణలో అతడు వెల్లడించిన విషయాలకు పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో సీపీ అవినాశ్‌ మహంతి శనివారం మీడియాకు వెల్లడించారు.

కళ్లు మూసుకొని కత్తితో పొడిచి..

సెలవు రోజుల్లో గల్లీలో పిల్లలందరూ కలిసి క్రికెట్‌ ఆడేవారు. కొన్ని రోజుల క్రితం సహస్ర తమ్ముడి బ్యాట్‌ నచ్చిన నిందితుడు తానొకసారి ఆడి ఇస్తానని అడగ్గా.. అతడు అంగీకరించలేదు. దీంతో ఎలాగైనా దాన్ని కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. వారి అపార్ట్‌మెంట్ల మధ్య కేవలం 2 అడుగుల దూరం మాత్రమే ఉండటంతో రెండుసార్లు గోడదూకి వెళ్లి పరిశీలించాడు. ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లినా తలుపులు తీసి లోపలకు వెళ్లే అవకాశం ఉందని గ్రహించాడు. ఓటీటీలో క్రైమ్‌ వెబ్‌సిరీస్‌లు, యూట్యూబ్‌లో సీఐడీ సీరియల్స్‌ చూసిన అనుభవంతో దొంగతనానికి పథకం రాసుకున్నాడు. ఎవరైనా అడ్డొస్తే భయపెట్టాలని వంటగదిలోని కత్తి తీసుకొని బయలుదేరాడు.

కానీ, ఇంట్లో ఎవరూ ఉండరనకుంటే సహస్ర కనిపించడంతో కాసేపు ఆలోచించాడు. ఆమె టీవీ చూస్తుండటంతో గుట్టుగా వెళ్లి బ్యాట్‌ తీసుకొని బయలుదేరాడు. ఈలోపు బాలిక గమనించి దొంగదొంగ అంటూ కేకలు వేస్తూ.. ఇంటి గుమ్మం వద్ద అతని చొక్కా పట్టుకొని వెనక్కి లాగింది. మీ డాడీకి చెబుతానంటూ బెదిరించింది. దీంతో భయపడిన బాలుడు కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు. మెడపై తీవ్రగాయం కావటంతో బాలిక నిర్జీవంగా పడిపోయింది. తరువాత బాలుడు కత్తిని అక్కడే నీళ్లతో కడుక్కొని, బ్యాట్‌ తీసుకొని తన ఇంటికి వచ్చాడు.

సహస్ర హత్యకు ఉపయోగించిన కత్తి, నిందితుడు దొంగిలించిన క్రికెట్‌ బ్యాట్‌

అమ్మ మీద ఒట్టు పెట్టి అబద్ధం..

ఇంట్లో తండ్రి, సోదరి ఉండటం చూసి.. రక్తపు మరకలు అంటిన చొక్కా కనబడకుండా అక్కడే ఆరేసిన మరో చొక్కాను అడ్డుపెట్టుకొని లోపలికి వెళ్లాడు. కత్తిని ఫ్రిజ్‌పై కవర్‌లో దాచాడు. దుస్తులు విప్పి వాషింగ్‌మెషిన్‌లో వేసి, స్నానం చేశాడు. తరువాత అతడు పెంచుకునే కుందేలు అపస్మారకస్థితికి చేరటంతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అది చనిపోయినట్టు చెప్పడంతో దిగాలుగా ఇంటికి చేరాడు. అప్పటికే సహస్ర హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు అతన్ని విచారించగా.. తాను ఇంట్లోనే ఉన్నానని.. సహస్ర డాడీ..డాడీ అంటూ కేకలు వేయడం వినిపించిందని.. కరడుగట్టిన నేరస్థుడే ఇదంతా చేసి ఉంటాడని వారిని తప్పుదోవ పట్టించబోయాడు. కుమారుడి ప్రవర్తనలో మార్పును తల్లి పసిగట్టింది. ఎవరూ చెప్పకుండానే స్నానం చేయటం, దుస్తులు తానే ఉతుక్కోవడం చూసి.. ‘సహస్ర హత్య విషయం నీకేమైనా తెలుసా’ అని ప్రశ్నించింది. అయినా బాలుడు ఆమె మీద ఒట్టేసి తానేం చేయలేదంటూ అమాయకత్వం నటించాడు. నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా ఉన్నావంటూ తల్లిని దబాయించాడు.

క్రికెట్‌ బ్యాట్‌ కొనేందుకు డబ్బుల్లేవని..

బాలిక శరీరంపై కత్తిపోట్లు బలంగా లేవని, 14-15 ఏళ్ల వయసున్న వారు చేసి ఉంటారని పోస్టుమార్టం చేసిన వైద్యులు చెప్పారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. హత్య సమయంలో ఒక బాలుడు గోడ పక్కన అనుమానాస్పదంగా కనిపించాడని అపార్ట్‌మెంటులో ఉంటున్న ఒక విద్యార్థి చెప్పాడు. దాని ఆధారంగా బాలుడిని ఠాణాకు తీసుకెళ్లి ప్రశ్నించారు. ‘క్రికెట్‌ బ్యాట్‌పై మోజు పడ్డాను. ఇప్పటికే మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. బ్యాట్‌ కొనివ్వమని అమ్మానాన్నలను ఇబ్బంది పెట్టకూడదని.. చోరీకి వెళ్లాను. దొంగతనం గురించి నా తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర అనడంతో భయమేసి కత్తితో పొడిచాను’ అని అంగీకరించాడు. అతన్ని సీసీఎల్‌ (చైల్డ్‌ ఇన్‌ కాన్‌ఫ్లిక్ట్‌ విత్‌ లా) ప్రకారం న్యాయస్థానంలో హాజరుపరిచారు.

సీఐడీ ఆఫీసర్‌ అవుతాననేవాడు..

నిందితుడు తనను సీఐడీ అధికారిగా భావించుకునేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. మిత్రులతో తాను పెద్దయ్యాక సీఐడీ ఆఫీసర్‌ అవుతానని చెబుతుండేవాడు. 2 నెలల క్రితం తన బ్యాట్‌ విరగ్గొట్టావని బెదిరించి ఓ బాలుడి వద్ద రూ.500 తీసుకుని ఆ డబ్బుతో పాత సెల్‌ఫోన్‌ కొన్నాడు. దానిలో హత్య, నేరాల వీడియోలు చూస్తుండటంతో తల్లి గమనించి స్విచ్చాఫ్‌ చేసింది

Join WhatsApp

Join Now

Leave a Comment