ఆకాశ’మంత ఆనందం…!!
అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న భారత పేసర్
మ్యాచ్‌లో పది వికెట్లతో అందరి ప్రశంసలు చూరగొన్న ఆకాశ్‌దీప్
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులోనూ టీమిండియా మెరుగైన ప్రదర్శనే చేసింది.
15 సెషన్ల పాటు సాగిన పోరులో… అధిక భాగం మనదే ఆధిపత్యం. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ శతకాలతో ప్రత్యర్థి ముందు 371 పరుగుల లక్ష్యం నిలిచింది.
ఎలాంటి పిచ్‌పైనైనా నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ స్కోరు ఛేదించడం కష్టతరమే! అందులోనూ ప్రపంచ అత్యుత్తమ పేసర్లలో ఒకడైన జస్‌ప్రీత్ బుమ్రాను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టడం అంటే ఆషామాషీ కాదు! అయితే ఇక్కడే ఇంగ్లండ్ ప్లేయర్లు తమ గేమ్ ప్లాన్‌తో ఆకట్టుకున్నారు. ]
బుమ్రాను గౌరవించిన ఆతిథ్య ఆటగాళ్లు ఇతర బౌలర్లపై విరుచుకుపడ్డారు. నిర్జీవ పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల పండగ చేసుకుంటుంటే… మనవాళ్లు చేష్టలుడిగి చూస్తుండటం తప్ప మరేం చేయలేకపోయారు. సిరాజ్ ప్రభావం చూపలేకపోగా… ప్రసిధ్ కృష్ణ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఏ బౌలర్‌కు సాధ్యం కాని చెత్త గణాంకాలు ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ నిర్ణయాలు బెడిసికొట్టడంతో… ఇక సిరీస్‌లో టీమిండియా కోలుకోవడం కష్టమే అనే వార్తలు వినిపించాయి.
దీనికి తోడు ఆరు నెలల ముందు నుంచే బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్టులే ఆడుతాడు అని మేనేజ్‌మెంట్ ఊదరగొడుతుండగా… రెండో మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. బరి్మంగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్ గెలిచిన చరిత్రలేని భారత జట్టు… ప్రధాన పేసర్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగింది. ఇంకేముంది మరో పరాజయానికి బాటలు పడ్డట్లే అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఇలాంటి స్థితిలోనే టీమిండియా అద్భుతం చేసింది. మహామహా ఆటగాళ్లకు సాధ్యం కాని ఘనతను ఖాతాలో వేసుకుంది. యువ సారథి శుబ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేయడం వల్లే టీమిండియా కొండంత స్కోరు చేసిన మాట వాస్తవమే అయినా… ఆత్మవిశ్వాసం లోపించిన బౌలింగ్ దళంలో జవసత్వాలు నింపిన ఘనత మాత్రం ఆకాశ్‌దీప్‌కే దక్కుతుంది.
బుమ్రా స్థానాన్ని భర్తీ చేయాల్సిన తీవ్ర ఒత్తిడిలో… కొత్త బంతి అందుకున్న ఆకాశ్‌దీప్ తన రెండో ఓవర్‌లోనే ఇంగ్లండ్‌కు ‘డబుల్ స్ట్రోక్’ ఇచ్చాడు. ఓ చక్కటి బంతితో డకెట్‌ను బుట్టలో వేసుకున్న ఈ బీహార్ పేసర్… తదుపరి బంతికి ఓలీ పోప్‌ను పెవిలియన్ బాట పట్టించి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఈ రెండు వికెట్లలో క్యాచ్‌లు పట్టిన గిల్, రాహుల్‌కు కూడా సమాన పాత్ర ఉన్నా… జట్టులో ఒక్కసారిగా సానుకూల దృక్పథం తీసుకొచ్చింది మాత్రం ముమ్మాటికీ ఆకాశ్‌దీపే.
మరో ఎండ్‌లో సిరాజ్ కూడా రాణించడంతో ఇంగ్లండ్ వెనకడుగు వేసినట్లే అనిపించినా… బ్రూక్, స్మిత్ ట్రిపుల్ సెంచరీ భాగస్వామ్యం తిరిగి ఆతిథ్య జట్టును పోటీలోకి తెచ్చింది. ఈ దశలో మరోసారి ఆకాశ్‌దీప్ డబుల్ ధమాకా మోగించాడు. బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్‌దీప్… వోక్స్‌కు పెవిలియన్ బాట చూపెట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అతడి బౌలింగ్ మరింత పదునెక్కింది.
నాలుగో రోజు రెండు వికెట్లు తీసిన ఆకాశ్… ఆఖరి రోజు తన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించాడు. వర్షం విరామం అనంతరం కాస్త సీమ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై చక్కటి బంతులతో పోప్, బ్రూక్‌ను అవుట్ చేసి భారత విజయానికి బాటలు వేశాడు. ఈ క్రమంలో కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో అదుర్స్ అనిపించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌దీప్ తీసిన ఐదు వికెట్లు వరుసగా డకెట్, రూట్, పోప్, బ్రూక్, స్మిత్‌వి కావడం అతడి బౌలింగ్ నైపుణ్యాన్ని చాటుతోంది.
బుమ్రాలాగా మెరుపు వేగం లేకున్నా… లైన్ అండ్ లెంగ్త్‌తో కూడిన క్రమశిక్షణ కట్టిపడేసింది. తొలి ఇన్నింగ్స్ ప్రదర్శన అనంతరం ‘తదుపరి మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందో లేదో’ అని అనుమానం వ్యక్తం చేసిన ఆకాశ్… రెండో ఇన్నింగ్స్ ప్రదర్శనతో తనను జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి కలి్పంచాడు. ఈ జోరు ఇలాగే సాగిస్తే సుదీర్ఘకాలం అతడు జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఖాయమే!
1692: ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన పరుగులు. భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్‌లో ఇవే అత్యధికం.
బుమ్రా అందుబాటులో లేకున్నా…
మా బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. పేసర్లే 17 వికెట్లు తీసి ఇస్తే.. కెప్టెన్‌కు ఇంకేం ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా 20 వికెట్లు తీయగల బౌలింగ్ దళం మాకు ఉంది. గతంలో ఎన్నోసార్లు సిరీస్ తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత తిరిగి పుంజుకున్నాం. గత మ్యాచ్ అనంతరం లోపాలపై దృష్టి పెట్టాం. ఈసారి బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శన వల్లే విజయం సాధ్యమైంది. నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. క్రీజులో ఉన్నప్పుడు బ్యాటర్‌గానే ఆలోచిస్తా. తదుపరి మ్యాచ్‌లో బుమ్రా
ఆడుతాడు.
– గిల్, భారత కెప్టెన్
ఈ ప్రదర్శనను క్యాన్సర్‌తో పోరాడుతున్న నా సోదరికి అంకితమిస్తున్నా. ఈ మ్యాచ్‌లో నా ఆటతీరుతో ఆమె ఎంతగానో సంతోషించి ఉంటుంది. బంతి అందుకున్న ప్రతిసారి నా మదిలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని అధిగమిస్తూ వికెట్లు పడగొట్టేందుకు ప్రయత్నిస్తా. సరైన ప్రదేశంలో బంతులేయడంపై దృష్టి పెట్టా అది ఫలితాన్నిచ్చింది. ఇంగ్లండ్ బ్యాటర్ల కోసం ప్రత్యేక ప్రణాళికలతో మైదానంలో అడుగుపెట్టా. వాటిని అమలు చేయడంలో విజయవంతమయ్యా. లార్డ్స్ టెస్టు గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం లేదు.
– ఆకాశ్‌దీప్, భారత బౌలర్