ఆ నలుగురి పాత్రలో ‘మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్’ సభ్యులు
ప్రొద్దుటూరు, డిసెంబర్ 29 (మనోరంజని తెలుగు టైమ్స్):
ప్రొద్దుటూరు పట్టణంలోని అన్నవరం ప్రాంతానికి చెందిన డి. హుస్సేనమ్మ (వృద్ధురాలు) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. అయితే, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పరిస్థితి విషాదకరంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ‘మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్’ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా, ఆయన తక్షణమే స్పందించి ఫౌండేషన్ సభ్యులతో కలిసి ముందుకు వచ్చారు. సోమవారం హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం వృద్ధురాలి అంతిమ సంస్కారాలను గౌరవంగా నిర్వహించారు.
ఈ మానవతా కార్యక్రమానికి సహకరించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్ర, కృప ఆగ్ని షారోన్ ట్రస్ట్ సభ్యులు ప్రసన్న కుమార్, సురేష్ పాల్, సాయి తదితరులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
సమాజంలో ఎవరూ లేనివారికి అండగా నిలవడమే తమ లక్ష్యమని ఫౌండేషన్ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.
అలాగే, శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని వారు కోరారు.
📞 82972 53484, 91822 44150
అవసర సమయంలో స్పందించి, మానవత్వాన్ని చాటుకున్న ‘మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్’ సభ్యుల సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.