TG Inter Admissions: విద్యార్థులు అలర్ట్.. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు చివరి అవకాశం!
TG Inter Admissions: తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును మరొకసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE).
2025-26 విద్యా సంవత్సరానికి ఈ ప్రవేశాల గడువు ఆగస్టు 20, 2025 వరకు పెంచినట్లు బోర్డు తాజాగా ప్రకటించింది. ఇంటర్ బోర్డు ప్రకారం, ఇది చివరి సారిగా ఇవ్వబోయే గడువుగా పేర్కొంది. ప్రవేశాల గడువుకు ఇది తుది అవకాశమని, ఆ తర్వాత గడువును మళ్లీ పెంచే అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. కాబట్టి ప్రవేశం కావాల్సిన వారు తక్షణమే అప్లై తీసుకోవాలి.
అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమైన కారణం.. అర్హత కలిగిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావడం నివారించడమే. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ఆలస్యంగా తమ ఎంపికలు ఖరారు చేస్తున్న నేపథ్యంలో వారికి అవకాశం కల్పించడమే లక్ష్యంగా బోర్డు ఈ గడువు పొడిగించింది. ఈ నిర్ణయాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్, మోడల్, ఇతర జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆగస్టు 20 లోగా ప్రవేశ ప్రక్రియను పూర్తిచేయాలని బోర్డు ఆదేశించింది.
ఈ సందర్బంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలలలో మాత్రమే ప్రవేశం తీసుకోవాలని బోర్డు సూచించింది. గుర్తింపు లేని సంస్థలలో అడ్మిషన్ తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లు tgbie.cgg.gov.in, అండ్ acadtgbie.cgg.gov.in ఈ వెబ్‌సైట్లలో గుర్తింపు పొందిన కళాశాలల జాబితా అందుబాటులో ఉంది. అభ్యర్థులు, తల్లిదండ్రులు దానిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది