విద్యార్థుల ఉద్యమం – యువతకు నూతన దిశ
M4News ప్రతినిధి – నల్లగొండ, అక్టోబర్ 9
“దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. నేటి రాజకీయాల్లో విద్యార్థి శక్తికి తగిన గౌరవం రావడం లేదు” అని విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బాబురామ్ అన్నారు.
నల్లగొండ జిల్లా స్థాయిలో విద్యార్థుల రాజకీయ పార్టీ నియామక కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్యార్థుల స్వరాన్ని ప్రజల స్వరంగా మార్చే లక్ష్యంతో మా పార్టీ బలంగా ముందుకు సాగుతోంది. జిల్లాలో విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగం, హాస్టల్ సదుపాయాల లోపం, ఫీజు ఎగవేతలు, అవినీతి వంటి అంశాలపై పోరాడేందుకు సిద్ధమైన యువతను ముందుకు తేవాలి” అని పిలుపునిచ్చారు.
మండల, నియోజకవర్గ, గ్రామ స్థాయిలలో విద్యార్థి కార్యకర్తల నియామక కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. “జిల్లాలో న్యాయం, సమానత్వం, విద్యార్థి హక్కుల కోసం కట్టుబడి ఉన్న ప్రతి యువకుడు పార్టీతో కలవాలి. ఎవరికైనా పోటీ చేయాలంటే పార్టీ మార్గదర్శకత్వం ప్రకారం సంప్రదించాలని” బాబురామ్ సూచించారు.
విద్యార్థుల కోసం కొత్త దిశలో రాజకీయ చైతన్యం తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.