శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టును సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెండోరా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేకంగా పహారా నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. వరద కాలువలు, నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకూడదని, నీటి సమీపంలో సెల్ఫీలు లేదా ఫొటోలు దిగేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. ప్రాజెక్టు పరిసరాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.












