ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. మంగళవారం కుబీర్ మండలంలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాలేగామ్ గ్రామంలో బైంసా నుండి నిగ్వ మహారాష్ట్ర బోర్డర్ వరకు నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దశలవారీగా గ్రామీణ రోడ్లను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయించుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బాసర ఆలయానికి గతంలో నిధులు మంజూరు కాకపోవడాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఆలయ నిర్మాణానికి 225 కోట్లు, ముధోల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 200 కోట్లు మంజూరు కావడం సంతోషకరమని అన్నారు. మంత్రి కొండా సురేఖ సమక్షంలో భిక్షాటన చేసైనా ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని గతంలో చెప్పిన మాటను గుర్తు చేశారు.
అభివృద్ధి పనులకు ప్రోటోకాల్ ప్రకారం అందరినీ సంప్రదిస్తున్నామని, దశలవారీగా నిధులు తెచ్చుకుంటున్నామని తెలిపారు. అయితే, ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వద్ద కొందరు సర్పంచులు ప్రొసీడింగ్స్ తీసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
నియోజకవర్గ ఎమ్మెల్యేగా అందరి పనులు రాజకీయాలకు అతీతంగా చేస్తానని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హామీ ఇచ్చారు. రెండున్నర సంవత్సరాల్లో నాలుగు వేల మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చెక్కులను పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.








