(తాడెం) (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
ఎడపల్లి మండలం టానాకాలం (తాడెం) గ్రామంలో కొమరం భీమ్ విగ్రహాన్ని నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ పోరాట స్ఫూర్తిని, ఆదివాసీల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలను విఠల్ రావు స్మరించుకున్నారు.
ఎడపల్లి మండలం టానాకాలం (తాడెం) గ్రామంలో కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విఠల్ రావు మాట్లాడుతూ కొమరం భీమ్ ఆదివాసీ, న్యాకపోడు సమాజాల ఆరాధ్య దైవమని కొనియాడారు. భూమి, విముక్తి, తెలంగాణ స్వేచ్ఛ కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి గిరిజనుల హక్కుల కోసం నిలిచిన గొప్ప యోధుడు కొమరం భీమ్ అని తెలిపారు. "జల్.. జంగల్.. జమీన్" నినాదంతో అడవి, నీరు, భూమిపై ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన వీరుడని అన్నారు. పశువుల కాపరులపై విధించిన పన్నులకు వ్యతిరేకంగా కూడా ఆయన పోరాడారని గుర్తు చేశారు.
కొమరం భీమ్ ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కొమరం భీమ్ స్ఫూర్తిని గుర్తించి ఆదివాసీ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టిందని విఠల్ రావు తెలిపారు. జోడేఘాట్లో కొమరం భీమ్ స్మారక విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు బృందావనం, ఆదివాసీ, బంజారా హిల్స్ భవనాల నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు.
ఆదివాసీ మ్యాకపోడు సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్ మాట్లాడుతూ ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూనే తమ హక్కుల కోసం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. పదవీ విరమణ అనంతరం కూడా స్వతంత్రంగా హక్కుల సాధన కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. శిరీషకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించకపోవడం బాధాకరమని, ఆమెకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వాలు మారినా ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని, ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో బండారి భోజన్న, మాజీ అధ్యక్షుడు గడ్డం శంకర్, ప్రధాన కార్యదర్శి పుట్ట శివశంకర్, స్థానిక సర్పంచ్ గెంటి అలక్య శ్రీనివాస్, నాయకులు దుపెల్లి లక్ష్మణ్, దిగాంబర్, కేసీఆర్ సేవా దళం జిల్లా అధ్యక్షుడు బి. రమణారావు, వెంకటాపూర్ సర్పంచ్ దాత్రిక అంజయ్య, మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, విగ్రహ దాత ఆకులుకొండూరు సాయి కుమార్, మ్యాకపోడు కుటుంబాల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.











