విజయవాడ గ్రామీణం, జూలై 27
జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం ఉద్దేశించిన హెల్త్ కార్డ్ పథకంలో, జర్నలిస్టులు చెల్లించాల్సిన వాటాను కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి (CSR) నిధుల నుండి భరించేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకు జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం వినతి చేసింది. ఈ ప్రతిపాదనపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ కింద జర్నలిస్టులు చెల్లించాల్సిన వాటాను కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి (CSR) నిధుల నుండి జమ చేయాలని కోరుతూ జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్ర ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డు కలిగిన జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం జర్నలిస్టు హెల్త్‌కార్డు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) కూడా కొనసాగుతుందని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కీము కింద రాష్ట్ర ప్రభుత్వం 1250 రూపాయలు భరించగా, మిగిలిన 1250 రూపాయలు జర్నలిస్టుల వాటాగా చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, ఈ స్వల్ప మొత్తాన్ని కూడా చాలా మంది జర్నలిస్టులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని సంఘం ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 1200 మంది అక్రిడిటేషన్ కార్డులు కలిగిన జర్నలిస్టులు ఉన్నారని, వీరిలో మెజార్టీ జర్నలిస్టులు 1250 రూపాయలు చెల్లించలేక హెల్త్‌కార్డును పొడిగించుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నాలుగు నెలలు గడిచినా, చాలా తక్కువ సంఖ్యలోనే హెల్త్‌కార్డు పొడిగింపు కోసం సొమ్ములు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారని, అత్యధికులు 1250 రూపాయలు చెల్లించలేక అలాగే ఉండిపోయారని కలెక్టర్ కు వివరించారు.
రేపు జర్నలిస్టు కుటుంబాలకు ఏదైనా విపత్తు లేదా అనారోగ్యం సంభవిస్తే ఆదుకునేందుకు ఈ కార్డు అందుబాటులో ఉండదని, దీనివల్ల జర్నలిస్టు కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన CSR నిధుల నుండి జర్నలిస్టుల వాటా కింద చెల్లించాల్సిన 1250 రూపాయలను జమ చేయాలని కలెక్టర్ ను కోరారు.
గత నాలుగు సంవత్సరాలుగా విశాఖపట్నం జిల్లాలో CSR నిధుల నుండి జిల్లా కలెక్టర్ నిధులను విడుదల చేసి జర్నలిస్టులకు హెల్త్‌కార్డుకు జమ చేస్తున్నారని, అదేవిధంగా మన జిల్లాలో కూడా CSR నిధుల నుండి జర్నలిస్టులకు హెల్త్‌కార్డుకు సొమ్ములు చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, వైజాగ్ నుండి సమాచారం సేకరించి, నిబంధనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎ.వి.వి.శ్రీనివాసరావు, కస్తాల నమ్మయ్య, చిన్న పత్రికల సంపాదకుల సంఘ అధ్యక్షులు ప్రసాద్, బాబు తదితరులు పాల్గొన్నారు.











