భైంసా, 28 June
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం భైంసాలో పర్యటించిన ఆయన రూ.30.32 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పలు కార్యక్రమాలను ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే ద్వి-సూత్రాన్ని అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలో పర్యటించిన మంత్రి రూ.30.32 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పట్టణంలో నిర్మించిన 440 డబుల్ బెడ్రూమ్ గృహాలను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇంటి తాళాలు, గృహ పట్టాలను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం అమృత్ పథకం కింద రూ.28.18 కోట్లతో చేపట్టనున్న భైంసా పట్టణ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆధునికీకరణ, కొత్త పైప్లైన్ల నిర్మాణం తదితర పనులకు భూమిపూజ నిర్వహించారు. అలాగే రూ.2.14 కోట్లతో చేపట్టనున్న మహదేవ్పూర్ చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే భైంసా పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు భూగర్భ జలాల మట్టాలు పెరిగి ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కార్యక్రమ ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటి, నీరు పోశారు.
అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గృహ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భైంసా అభివృద్ధికి నిధుల కొరత లేదని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
పాల్సికర్ రంగారావు ప్రాజెక్టు కారణంగా నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అవినీతికి తావులేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు, కొత్త రేషన్ కార్డుల జారీ, త్వరలో కొత్త సామాజిక భద్రత పింఛన్ల మంజూరు వంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఎంపీ జి. నగేష్ మాట్లాడుతూ, భైంసా పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత పట్టణ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని పేర్కొన్నారు.












