తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని ఈసారి రైతుల ఖాతాల్లో ఒకేసారి జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ నిధుల విడుదల జరగనుంది.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు. మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలంలో ఈ నెల 30న నిర్వహించనున్న 'రైతు ఆశీర్వాద సభ'లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం అధికారికంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం కింద ఎకరాకు రూ. 6 వేల చొప్పున, రెండు సీజన్లలో కలిపి మొత్తం రూ. 12 వేల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
రైతుభరోసా లబ్ధి పొందడానికి ప్రభుత్వం కీలక విధివిధానాలను ఖరారు చేసింది. ఈ నెల 15వ తేదీ నాటికి 'భూభారతి' పోర్టల్‌లో భూమి వివరాలు నమోదై, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ (CCLA) నుంచి అనుమతులు పొందిన రైతులకు మాత్రమే ఈ సాయం అందుతుంది. అలాగే, ఆర్ఓఎఫ్ఆర్ (ROFR) పట్టాలు కలిగిన గిరిజన రైతులు కూడా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ నుంచి అనుమతులు పొంది ఉండాలి. అర్హులైన రైతుల రికార్డులను ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఒక జిల్లా పరిధిలోనే దాదాపు 3.58 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉండగా, వారి కోసం రూ. 460 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలో కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన 3,906 మంది రైతులు కూడా ఉన్నారు. రాబోయే వ్యవసాయ సీజన్‌కు రాష్ట్రంలో యూరియా కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటికే 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలను సిద్ధం చేశామని, మొబైల్ యాప్‌లో బుక్ చేసుకున్న వెంటనే రైతులకు యూరియా అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
త్వరలోనే వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రైతులు వాటికి అనుకూలమైన పంటలను సాగు చేయాలని ఆయన సూచించారు.











