షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై విద్యుత్ వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపులు, కంట్రోల్ యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ జిల్లాకు 253 యూనిట్లు కేటాయించగా, మొత్తం రూ.348.46 కోట్లు మంజూరు చేశారు.
ఈ పథకం కింద యువతకు విద్యుత్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ పరికరాల యూనిట్లు అందించనున్నారు. ద్విచక్ర వాహనాలకు 90% సబ్సిడీ, మూడు చక్రాల వాహనాలకు 70% సబ్సిడీ, సోలార్ యూనిట్లకు 60% సబ్సిడీ వర్తిస్తుంది. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా వాహనాలకు), రెండెకరాల భూమి, పట్టాదారు పాస్ బుక్ (సోలార్ పంప్ సెట్లకు) వంటి పత్రాలతో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల గడువును ఏప్రిల్ 08 వరకు పొడిగించారు.
పథకాలకు దరఖాస్తు చేసుకునేవారి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి. వ్యవసాయేతర పథకాలకు 21-50 ఏళ్లు, వ్యవసాయ పథకాలకు 21-60 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందినవారు, దళితబంధు లబ్ధిదారులు అనర్హులు. మహిళలకు 33%, దివ్యాంగులకు 5% కోటా కేటాయించారు.












