నిర్మల్ జిల్లాలోని గుట్టలపై అరుదైన 'రింగింగ్ స్టోన్స్' (రాగాలు పలికే రాళ్లు) గుర్తించబడ్డాయి. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డా. తుమ్మల దేవరావ్ ఈ రాళ్లను 'కంచు బండలు'గా పిలుస్తారని, వీటిని భౌగోళిక సంపదగా గుర్తించి సంరక్షించాలని సూచించారు.
సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం దక్కన్ పీఠభూమిలో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడిన బసాల్ట్ శిలల్లో కొన్ని ప్రత్యేక నిర్మాణం కారణంగా రాగాలు పలికే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఈ రాళ్లను 'లిథోఫోన్స్' అని కూడా పిలుస్తారు. ఒక రాయిని మరో రాయితో కొట్టినప్పుడు కంచు మ్రోగినట్లుగా స్వరాలు వినిపిస్తాయి.
నిర్మల్ జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. బాసరలోని వేదశిల, నిర్మల్ ఖిల్లా గుట్టపై ఉన్న ఒక పెద్ద రాయి కూడా స్వరాలు పలుకుతాయని డా. దేవరావ్ తెలిపారు. అయితే, ఖిల్లా గుట్టపై ఉన్న ప్రాంతం ప్రమాదకరంగా ఉండటంతో అక్కడికి చేరుకోవడం కష్టమని ఆయన పేర్కొన్నారు.
డా. తుమ్మల దేవరావ్ ఈ అరుదైన రాగాలు పలికే రాళ్లను జియో హెరిటేజ్ స్పాట్‌గా అభివృద్ధి చేసి, సంరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల నిర్మల్ చారిత్రక, భౌగోళిక సంపదకు మరింత గుర్తింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.












