జాతీయ స్థాయిలో నిర్మల్ జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి. కొయ్య బొమ్మల సంప్రదాయ పరిరక్షణకు చేపట్టిన ‘పొనికి వనం’ కార్యక్రమానికి, మాతృత్వ మరణాలను తగ్గించే ‘అమ్మరక్షిత’ కార్యక్రమానికి ఈ పురస్కారాలు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అవార్డులను స్వీకరించారు.
జాతీయ స్థాయిలో నిర్మల్ జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. జిల్లాలో అమలు చేసిన రెండు వినూత్న కార్యక్రమాలకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు లభించాయి. ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఈ అవార్డులను అందుకున్నారు.
కొయ్య బొమ్మల సంప్రదాయాన్ని పరిరక్షించే లక్ష్యంతో చేపట్టిన ‘పొనికి వనం’ కార్యక్రమం జాతీయ గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమం ద్వారా కొయ్య బొమ్మల తయారీకి అవసరమైన పొనికి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించారు. ఈ అవార్డును జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మితో కలిసి కలెక్టర్ స్వీకరించారు.
అలాగే, జిల్లాలో మాతృత్వ మరణాలను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించిన వైద్య ఆరోగ్య శాఖ యొక్క ‘అమ్మరక్షిత’ కార్యక్రమానికి మరో స్కోచ్ అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేందర్‌తో కలిసి కలెక్టర్ అందుకున్నారు.
అవార్డుల స్వీకరణ అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జాతీయ వేదికపై జిల్లాకు గుర్తింపు రావడం ఆనందదాయకమని తెలిపారు. అధికారుల సమష్టి కృషి, సమన్వయం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమాల అమలులో భాగస్వాములైన అధికారులకు ఆమె అభినందనలు తెలియజేశారు.












