తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెండోరా మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, మహనీయుల స్మరణ కార్యక్రమాలు చేపట్టారు.
మెండోరా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన మహనీయులను స్మరించుకున్నారు. వారి త్యాగాలను కొనియాడుతూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మెండోరా పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జాదవ్ సుహాసిని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రాముఖ్యతను, అమరవీరులను స్మరించుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
పోచంపాడు ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రాకేష్ ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ప్రభుత్వ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.












