నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో ‘99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం గ్రామసభలు విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కుంటాల మండల పరిధిలోని 15 గ్రామపంచాయతీల్లో స్పెషల్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలు సజావుగా జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కుంటాల సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
కుంటాల మండల కేంద్రంలో జరిగిన గ్రామసభకు అదనపు కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు హాజరై, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆరు గ్యారెంటీ’ సంక్షేమ పథకాల లక్ష్యాలు, అర్హతలు, అమలు విధానంపై ప్రజలకు వివరించారు. పథకాల ద్వారా లబ్ధి పొందినవారు తమ అనుభవాలను పంచుకున్నారు.
కొన్ని గ్రామపంచాయతీలలో అర్హత ఉన్నప్పటికీ ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం అందలేదని కొందరు ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు ఎల్బి-1, ఎల్బి-2, ఎల్బి-3 కేటగిరీల ప్రకారం అర్హుల ఎంపిక విధానాన్ని వివరించి అవగాహన కల్పించారు.
ఈ గ్రామసభల్లో పలువురు సర్పంచ్లు, స్పెషల్ అధికారులు, పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతో గ్రామసభలు విజయవంతంగా ముగిశాయి.












