బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల దరఖాస్తులను స్వీకరించి, ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నామని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి తెలిపారు.
నిర్మల్ పట్టణంలోని 36, 37 వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.
మున్సిపల్ చైర్మన్ కావ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. రెండువందల యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డులు, లబ్ధిదారులకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
రానున్న రోజుల్లో పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రతి కాలనీలో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు చైర్మన్ వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, టీపీవో హరీష్, డీఈ హరిభువన్, వార్డు అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.












