జమ్మూ కాశ్మీర్ లోని 4 వేల అడుగుల ఎత్తైన మంచు పర్వతాలపై మైనస్ 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూచిపూడి నృత్యం ప్రదర్శించిన నిర్మల్ పట్టణానికి చెందిన వరణ్య అనే బాలికను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభినందించారు.
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో బాలికను సత్కరించి, శాలువా కప్పి గౌరవించారు. ఈ ప్రదర్శన ద్వారా నిర్మల్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటడం గొప్ప విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
బాలిక జమ్మూ కాశ్మీర్ లోని బారాముల జిల్లా గుల్మార్గ్ ప్రాంతంలో గల ఆఫర్వాత్ పర్వతంపై 'శ్రీ విజ్ఞరాజం భజే' అనే కూచిపూడి నృత్య ప్రదర్శన చేసిందని తెలిపారు. రాబోవు రోజుల్లో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి జిల్లా గౌరవాన్ని పెంచాలని ఆమెను ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఖమ్మం సురేందర్, మాజీ ఎంపీపీ రమేష్, నాయకులు రాజేశ్వర్, జీవన్ రెడ్డి, మల్లేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లాకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.











