దేశాభివృద్ధికి జనగణన ప్రక్రియ అత్యంత కీలకమని, దీని ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భారత జనాభా గణన–2027 కార్యక్రమానికి సంబంధించి అధికారులకు సోమవారం కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, దేశాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జనగణన ఆధారంగానే ప్రభుత్వం ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ప్రజా ప్రయోజనాల రూపకల్పన జరుగుతుందని తెలిపారు.
గృహాల గుర్తింపు, జనగణన వివరాల నమోదులో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. మాస్టర్ ట్రైనర్లు అందించే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు.
జనగణన ప్రక్రియను బాధ్యతగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీఓ జీవరత్నం, డిపివో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












