గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం, వేతనాల చెల్లింపు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై సీఐటీయూ నాయకులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
నేరదడిగొండ మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను కలిసి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.
సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను పంచాయతీ నిధుల ద్వారా చెల్లించాలనే రాష్ట్ర ప్రభుత్వ సర్క్యులర్‌ను రద్దు చేయాలని, ముఖ్యమంత్రి హామీ మేరకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేశారు.
జీవో నెం.51 సవరణ మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని, ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలని కోరారు.
కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, బకాయి వేతనాలను తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ నాయకులు విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.


