మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వరుసకు తాతయ్య అయిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న మనవడు, సంకపాగ దేవన్న (35) గుండెపోటుతో మృతి చెందాడు.
గురువారం ఉదయం దేవన్నకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడు స్థానికంగా ఒక మెడికల్ స్టోర్ లో పనిచేస్తున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, దేవన్న తన కుటుంబంతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి మండలం కప్పర్ల గ్రామానికి బయలుదేరారు. అక్కడ దేవన్నకు తాతయ్య అయ్యే డి. చిన్నరాజన్న మరణించడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బస్సులో ప్రయాణమవుతున్నారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ చేరుకోగానే దేవన్నకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో బస్సు దిగాడు. అక్కడి నుంచి వేరే బస్సులో పొనకల్ కు తిరిగి వచ్చి, ఆ తర్వాత వాహనంలో లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దేవన్న తుది శ్వాస విడిచారు.
మృతునికి భార్య వసంత ఉన్నారు. పిల్లలు కలగలేదు. దేవన్న అంత్యక్రియలు పొనకల్ లో నిర్వహించారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.












