నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 16వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పంచారెడ్డి సురేష్ మంగళవారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఈ వార్తపై నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బుధవారం ఉదయం సురేష్ నివాసానికి చేరుకున్న విఠల్ రావు, ఆయన పార్థివ దేహానికి పుష్పగుచ్ఛం సమర్పించి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా విఠల్ రావు మాట్లాడుతూ, పంచారెడ్డి సురేష్‌తో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన తర్వాత, ప్రతి సమావేశంలోనూ డివిజన్ అభివృద్ధిపై చర్చించేవారని గుర్తు చేసుకున్నారు. డివిజన్ కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసేవారని పేర్కొన్నారు.
తాను జడ్పీ చైర్మన్‌గా ఉన్న సమయంలో కూడా ఈ అనుబంధం కొనసాగిందని విఠల్ రావు తెలిపారు. ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తించి, ప్రస్తుతం ఆయన సతీమణి పంచారెడ్డి అనితను కార్పొరేటర్‌గా ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. పంచారెడ్డి సురేష్ మృతి ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని విఠల్ రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు జాతీయ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, నమస్తే తెలంగాణ బాసర రిపోర్టర్ అచ్యుత్ రావు, మాజీ కార్పొరేటర్లు జగత్ రెడ్డి, యేనగందుల మురళి, రంగు సీతారాం, పురుషోత్తం, వేణుగోపాల్ తదితరులు కూడా నివాళులర్పించారు.








