రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బాసర పర్యటన నేపథ్యంలో, అందుకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6న జరగనున్న పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి అధికారులతో నిర్వహించిన సమావేశంలో, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి బాసర చేరుకున్నప్పటి నుంచి, ఆలయ సందర్శన, పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, తిరిగి వెళ్లేవరకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
హెలిప్యాడ్, ఆలయం లోపల, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను మెరుగుపరచాలని, ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించాలని సూచించారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తమ బాధ్యతలపై అంతర్గత శాఖాపరమైన ఆదేశాలను వెంటనే జారీ చేయాలని తెలిపారు.
అధికారుల సమన్వయం, అంకితభావంతో పనిచేయడం ద్వారా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, ఆలయ ఈవో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.








