కొల్హాపూర్ సంస్థాన పాలకుడు, రిజర్వేషన్ల ఆద్యుడు చత్రపతి సాహు మహారాజ్ 151వ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా బీఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు.
బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ మాట్లాడుతూ, చత్రపతి సాహు మహారాజ్ బహుజనులకు రిజర్వేషన్లు కల్పించి, సంస్థానాన్ని సామాజిక సంస్థానంగా మార్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన గౌతమ బుద్ధుడు, కబీర్ దాస్, మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను ఆచరణలో చూపారని తెలిపారు.
కొల్హాపూర్ సంస్థానంలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం తీసుకురావడం ద్వారా, తొలిసారిగా బహుజనులకు రిజర్వేషన్లు అందించిన ఘనత ఆయనదేనని జగన్ మోహన్ పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యాభ్యాసానికి సహకరించడమే కాకుండా, 'ముక్ నాయక్' పత్రికకు అండగా నిలిచారని గుర్తు చేశారు.
ఉద్యోగ అవకాశాలు కల్పించడం, భూములకు పట్టాలు ఇవ్వడం, అంటరానితనం నిర్మూలన, వితంతు వివాహ చట్టం, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం వంటి సంస్కరణలు చేపట్టిన మానవతావాది చత్రపతి సాహు మహారాజ్ అని అన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












