ఎపిలో ఇన్ ల్యాండ్ వాటర్ సేవలను ప్రారంభించండి
ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ మధుకానన్ తో మంత్రి లోకేష్ భేటీ
దావోస్: ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ మధుకానన్ తో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటి పర్యావరణ వ్యవస్థ, నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్, తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలను పెంచేందుకు విశాఖపట్నంలో రీజనల్ టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వాహనరంగం వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయండి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలతోపాటు స్థిరమైన పట్టణ రవాణాకు మద్దతుగా Uber ఫ్లీట్‌లో EVలను సమగ్రపర్చి సేవలందించండి. రాష్ట్రంలో ముఖ్యమైన నదులు, కాలువలు, సరస్సుల వెంబడి ఇన్ ల్యాండ్ వాటర్ వే సర్వీస్ ను పరిచయం చేయండి. ఉబెర్ యాప్ ద్వారా శ్రీనగర్ దాల్ సరస్సులో షికారా రైడ్ తరహా లో స్పీడ్ బోట్ సర్వీసులను ప్రారంభించండి. EV టెక్నాలజీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, కస్టమర్ సేవలో డ్రైవర్లు, మెకానిక్‌లు, ఫ్లీట్ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వడం, అప్‌స్కిల్ చేయడానికి ఎపి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC)తో కలిసి పనిచేయండి. పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నందున క్యూరేటెడ్ మార్గాలు, హెరిటేజ్ సైట్లలో ఎలక్ట్రిక్ షటిల్ సేవలు, టూరిజం-హెవీ జోన్లలో మెరుగైన రైడ్-హెయిలింగ్ సేవలను ప్రారంభించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. ఉబెర్ వైస్ చైర్మన్ మధుకానన్ మాట్లాడుతూ… 2040 నాటికి జీరో ఎమిషన్ సాధనలో భాగంగా ఉబెర్ సంస్థ ఉబెర్ గ్రీన్ పేరుతో ఎలక్ట్రిక్ వాహన సేవలను అందిస్తోందని తెలిపారు. గత పదేళ్లలో ఉబెర్ సంస్థ డ్రైవర్స్ భాగస్వామ్యంతో 50వేల కోట్లరూపాయల వ్యాపారం చేసిందని తెలిపారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని మధుకానన్ చెప్పారు.