వైభవంగా శ్రీవారి గరుడసేవ
మనోరంజని ప్రతినిధి – తిరుపతి, సెప్టెంబర్ 28
వర్షాన్ని లెక్క చేయని భక్తజనసంద్రం… వరుణుని జల్లుల మధ్య ఘనంగా గరుడసేవ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం రాత్రి, శ్రీ మలయప్పస్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయం ప్రసాదించారు. సాయంత్రం 6 గంటలకు గరుడసేవ ప్రారంభమైంది.
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తూ, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, భక్తులు భక్తిపారవశ్యంలో గరుడవాహనంపై స్వామివారి దర్శనానికి హాజరయ్యారు. అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించబడ్డాయి.
గరుడవాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణికంగా 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవకు అత్యంత ప్రాధాన్యం ఉంది. గరుడవాహనం ద్వారా స్వామివారు భక్తులకు “దాసానుదాసుడను” అనే సందేశాన్ని ఇస్తారు. జ్ఞానవైరాగ్యాన్ని కోరే భక్తులు, గరుడుని దర్శించి సర్వపాపాలు తొలగిస్తాయని పురాణాలు తెలియజేస్తాయి.
ఈ మహోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.