మిర్యాలగూడ, జులై 23
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 12 ఏళ్ల గుండా కార్తికేయ చెస్, కరాటే రంగాలలో ప్రపంచ రికార్డులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న వయసులోనే సాధించిన ఈ విజయాలు అతన్ని 'సూపర్ కిడ్'గా నిలబెట్టాయి.
చిన్న వయసులోనే చెస్, కరాటేలలో ప్రపంచ రికార్డులు సాధించి సత్తా చాటిన గుండా కార్తికేయ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రపంచ రికార్డులు సాధించడానికి వయసు అడ్డంకి కాదని 12 ఏళ్ల సూపర్ కిడ్ గుండా కార్తికేయ నిరూపించాడు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన కార్తికేయ, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్' సాధించాడు. గత ఏప్రిల్ 26న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, జె.ఆర్. ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీల ఆధ్వర్యంలో అతిపెద్ద కరాటే ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో ఒకే ప్రాంగణంలో 1,122 మంది క్రీడాకారులు ప్రదర్శించిన పంచ్‌లు, కిక్స్ 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్'ను కైవసం చేసుకున్నాయి.
ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో మిర్యాలగూడ సంస్కృతి స్కూల్ 7వ తరగతి విద్యార్థి, మహా న్యూస్ రిపోర్టర్ గుండా మహేష్, చంద్రకళ దంపతుల కుమారుడైన గుండా కార్తికేయ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. తన 5వ ఏట నుంచే కరాటే కోచ్ రామకృష్ణ మాస్టర్ పర్యవేక్షణలో కఠోర సాధన చేస్తూ, శ్రమను ఆయుధంగా మలచుకుని ఈ గిన్నిస్ రికార్డ్‌లో భాగస్వామి అయ్యాడు.
కేవలం మార్షల్ ఆర్ట్సే కాకుండా, గతంలో 180 చెస్ బోర్డుల ప్రాబ్లమ్స్‌ను కేవలం 9.41 నిమిషాల్లో సాల్వ్ చేసి 'నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్' సాధించాడు కార్తికేయ. మైండ్ పవర్‌తో చెస్, ఫిజికల్ ఫిట్నెస్తో కరాటే రెండింట్లోనూ అంతర్జాతీయ రికార్డులతో మిర్యాలగూడ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాడు ఈ చిన్నారి.
తండ్రి నుంచి అలవడిన కష్టపడే తత్వం, క్రమశిక్షణ కార్తికేయను సూపర్ కిడ్ గా మార్చి ప్రపంచ రికార్డులు సాధించేలా చేశాయి. పట్టుదల ఉంటే ఎంతటి రికార్డునైనా సొంతం చేసుకోవచ్చని నిరూపించిన 12 ఏళ్ల కార్తికేయతో పాటు, అతని కోచ్ మాస్టర్ రామకృష్ణపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. కార్తికేయకు పలువురు అభినందనలు తెలియజేశారు. ముందు ముందు మరిన్ని ప్రపంచ రికార్డులు సాధించాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.












