28 ఏళ్లుగా కాంగ్రెస్‌లో సేవ – ఇప్పుడు కూరగాయల వ్యాపారంతో జీవనం: కార్యకర్త గోడు
బోధన్, సెప్టెంబర్ 21 (M4News):
కాంగ్రెస్ పార్టీలో 28 సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన తనలాంటి నిజమైన కార్యకర్తలను పట్టించుకునే నాధులు లేరని సీనియర్ నాయకుడు ఎం. లక్ష్మణ్ గోడు వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి చెందిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
ఎం. లక్ష్మణ్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేసి ఈరోజు కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో పార్టీలు ఆహ్వానించినా, నేను పోలేదు. ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నా. కానీ పాత కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి దయనీయంగా మారింది. బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఉంది. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు” అని అన్నారు.
అలాగే, “మా సమస్యలు, మా బాధలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లే విధంగా చూడాలి. ఎవరు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా, నేను ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కాంగ్రెస్ మా ఊపిరి” అని ఎం. లక్ష్మణ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పునరుద్ధరణలో భాగంగా పాత కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని, వారి కష్టాలను గుర్తించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.