ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో 220 కార్మికుల తొలగింపుపై తీవ్ర నిరసన
మనోరంజని | తెలుగు టైమ్స్ | ఆసిఫాబాద్, అక్టోబర్ 15
ఏజెన్సీ ప్రాంతంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న సుమారు 220 మంది గిరిజన కార్మికులను అకస్మాత్తుగా విధుల నుండి తొలగించడం తీవ్రంగా ఖండనీయమని ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కమిటీ తరఫున జాదవ్ సుమేష్ మాట్లాడుతూ —“గత ఆరు నెలలుగా జీతాలు లేకపోయినా విద్యార్థుల సేవలో నిబద్ధతతో పనిచేస్తున్న కార్మికులను ఒకే సారిగా తొలగించడం అన్యాయం. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి (పి.ఓ) తక్షణమే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి,” అని డిమాండ్ చేశారు.
అలాగే ఆయన హెచ్చరిస్తూ అన్నారు: “సిఆర్టి, ఈఎంఆర్‌ఎస్ గురుకులాలు, హార్టికల్చర్ వంటి శాఖల్లో అర్హతలులేని నియామకాలను విచారించకుండా అమాయక గిరిజన కార్మికులనే లక్ష్యంగా చేసుకోవడం అసహ్యం. ట్రైబల్ కార్మికులపై ఈ విధమైన దౌర్జన్యం కొనసాగితే, డీఎస్సీ సాధన కమిటీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుంది.”
ప్రభుత్వం ఈ అంశంపై సత్వర స్పందించి, బాధిత గిరిజన కార్మికులకు న్యాయం చేయాలని కమిటీ డిమాండ్ చేసింది.