*స్థానిక సమరానికి “సై” 💪*
*మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి*
హైదరాబాద్:నవంబర్ 26
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం షెడ్యూల్‌ను విడుదల చేయడంతో.. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు తమ నాయకులను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తం గా పండుగ వాతావరణం లో ఎన్నికల సందడి మొద లైంది.ఎస్‌ఈసీ అధికారిణి రాణి కుముదిని ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు విడతల్లో జరుగనుంది.
డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత పోలిం గ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ జరిగిన రోజునే.. మధ్యా హ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.
షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. నామి నేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదటి విడతకు నవంబర్ 27న, రెండో విడతకు నవంబర్ 30న, మూడో విడతకు డిసెంబర్ 3న ప్రారంభమవుతుంది.
రాష్ట్రంలోని మొత్తం 12,728 గ్రామ పంచాయతీ లకు.. 1,12,288 వార్డులకు ఈ ఎన్నికలు జరుగుతా యి. ఈ స్థానిక ఎన్నికలు గ్రామస్థాయి అభివృద్ధికి, సంక్షేమానికి పాలకవర్గాన్ని ఎన్నుకోవడంలో అత్యంత కీలకం కావడం వల్ల.. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తమ మద్దతుదారులను గెలిపించుకోవడానికి వ్యూ హాలు సిద్ధం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఎస్‌ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.