జర్నలిస్టులకు రూ.15,000 పెన్షన్ – బీహార్ నిర్ణయం అభినందనీయం
తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి: టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి డిమాండ్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జర్నలిస్టులకు నెలకు రూ.15,000 పెన్షన్‌ను ప్రకటించడం సర్వత్రా ప్రశంసలు తెచ్చుకుంటోంది. ఇది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలవాలని, తెలంగాణ ప్రభుత్వము కూడా ఇదే బాటలో నడవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ (టీఎస్‌జేఏ) రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి కోరారు.
బుధవారం సూర్యాపేటలోని టీఎస్‌జేఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. “బీహార్‌కి సాధ్యమైన ఈ నిర్ణయం తెలంగాణకు సాధ్యపడదా?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ అసోసియేషన్ అన్ని విధాలా ఉద్యమానికి సిద్ధంగా ఉందని, యూనియన్లకు అతీతంగా ఉన్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో 90% జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా ఉంది
తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది జర్నలిస్టులు ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. “జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడే ఉద్యమాలను కొన్ని ధనిక వర్గాలు అణచివేస్తున్నా, అసలైన పీడితులు మద్దతు తెలిపి ముందుకు రావాలి” అని యాదగిరి హితవు పలికారు.
ఉద్యమ కార్యాచరణకు పునాది
ఈ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కేంద్ర మంత్రులను కలిసి చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల డిమాండ్లను పట్టించుకోకపోతే, విస్తృత ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు.
ఈ సమావేశంలో టీఎస్‌జేఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దుస్సా చంద్రశేఖర్, కోశాధికారి చందుపట్ల శ్రీకాంత్, పట్టణ ఉపాధ్యక్షుడు బచ్చలకూరి వెంకన్న, మండల అధ్యక్షుడు కుంచం రాంబాబు, పట్టణ సహాయ కార్యదర్శి భట్టారం వంశీకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.