రేవంత్ సభ విజయానికి సమీక్ష సమావేశం
నిర్మల్, జనవరి 15 (మనోరంజని టైమ్స్):
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు గురువారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి నిర్మల్ నియోజకవర్గం నుంచి జన సమీకరణపై విస్తృతంగా చర్చించారు.
ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డి సభను సమిష్టి కృషితో విజయవంతం చేయాలని నేతలు నిర్ణయించారు. ఇందుకోసం గ్రామ స్థాయి నుంచి పట్టణ వార్డు స్థాయి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.